మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై తాము నిరాధార ఆరోపణలు చేయలేదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. ఈ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని తెలిపింది. బ్యారేజీలో పలు లోపాలున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో అవాస్తవాలు చెప్పామని తెలంగాణ చేసిన ఆరోపణలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
మేడిగడ్డ ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్,.క్వాలిటీ కంట్రోల్, నిర్వహణలో లోపాలున్నాయని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తేల్చిచెప్పింది. నివేదికలో తాము పేర్కొన్న అంశాలకు రాష్ట్రం సమాధానం ఇవ్వలేదని వెల్లడించింది. ఈ మేరకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ సంజయ్‌కుమార్ సిబల్ తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ సూచనమేరకు మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో కుంగిన వంతెనను, దెబ్బతిన్న పియర్స్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ ప్రణాళిక, డిజైన్‌తో సహా పలు లోపాలను పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరణ ఇస్తూ చేసిన ఆరోపణలపై తాజాగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ క్లారిటీ ఇచ్చింది.