నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. డ్యామ్‌ల డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించనుంది. ఈరోజు ఉదయం పర్యటనకు బయల్దేరనున్న టీమ్.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకూ బ్యారేజీని పరిశీలించనుంది. ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. బ్యారేజీ పగుళ్లు కారణంగా ఆనకట్ట సామర్ధ్యం గేట్ల పరిస్ధితి సమగ్రంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫార్సులు చేయనుంది.
మధ్యాహ్నం భోజనానంతరం అధికారుల బృందం, అన్నారం బయలు దేరి అక్కడి బ్యారేజీలో సీపేజీకి దారి తీసిన కారణాలను సమగ్రంగా పరిశీలిస్తుంది. వర్షాకాలంలో గోదావరికి వరద ప్రారంభమైయ్యే పరిస్ధితులనూ పరిగణనలోకి తీసుకుని. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను నిపుణుల కమిటీ నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. రేపు సుందిళ్ల బ్యారేజీని ఈ బృందం సందర్శించనుంది. పరిశీలన అనంతరం నిపుణుల కమిటీ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో సాగునీటి శాఖ అధికారులతో భేటీ అనంతరం అధికారుల బృందం దిల్లీ బయలుదేరనుంది.