త్వరలోనే తెలంగాణలో “నీరా కేఫ్”లు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల సాంప్రదాయక జీవనోపాధిని పెంపొందించడంతో పాటు ఆరోగ్య పానీయాన్ని హైదరాబాద్ వాసులకు అందించేందుకు నీరా పాలసీని తీసుకొస్తు న్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి బి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఆల్కహాల్ లేని నీరాను దాని ఉప ఉత్పత్తులను శుద్ధి చేసి హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ద్వారా విక్రయించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో సభ్యులు ప్రకాష్ గౌడ్, ఆత్రం సక్కు, మెతుకు ఆనంద్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ, రూ. 12.20 కోట్లతో నీరాకేఫ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోమ్ నగరానికి చెందిన రచయిత కొన్ని శతాబ్దాల క్రితమే ఈ సాంప్రదాయ చెట్లకు సంబంధించి రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. త్వరలోనే నూతన క్రీడా విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.