తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎలాంటి పొత్తులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికలలో పోరాడుతుందని ప్రకటించారు. బిఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేయవచ్చని.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ చైనాలో కూడా పోటీ చేయవచ్చని ఎద్దేవా చేశారు.
2024 ఎన్నికలను విభజన శక్తులు, సంఘటిత శక్తుల మధ్య పోరుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని.. వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. అంత డబ్బు ఈ పార్టీలకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. మోడీ హయాంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని.. ఇండిపెండెంట్ గా ఉండాల్సిన సంస్థలను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. భారత్ జోడో పాదయాత్రలో చాలా నేర్చుకుంటున్నానని అన్నారు రాహుల్ గాంధీ.