జూన్ మాసం గడిచిపోయింది. జులైలో దాదాపుగా సగం రోజులు గడిచాయి. అయినా సరైన వర్షాలు లేవు. ఈ ఏడాది వానాకాలం పరిస్థితులు చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన కృష్ణా బేసిన్ దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం ఖాయమనిపిస్తోందని నీటిపారుదల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన నీటి ప్రవాహాలను పరిగణనలోకి తీసుకొంటే.. నాటి సంక్షోభం పునరావృతమయ్యే అవకాశం ఉందని అంటున్నాయి.
వానాకాలం ఆరంభమై 40 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఎగువ కృష్ణానదిపై ఉన్న ఆలమట్టిలోకి చుక్కనీరు కూడా (జీరో టీఎంసీ) రాలేదు. ఇలాంటి పరిస్థితి ఆలమట్టి నిర్మాణం తర్వాత ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆలమట్టి నిర్మాణం తర్వాత తక్కువ ప్రవాహాలు ఉన్నప్పుడు జులై ఆఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో దిగువకు నీటిని విడుదల చేసిన సందర్భాలున్నాయి. అయితే జులై మొదటి పక్షం వరకు ఎంత తక్కువ అనుకున్నా 25 నుంచి 30 టీఎంసీలు వచ్చేవి. కానీ ఈఏడాది ఇప్పటివరకు ఆ పరిస్థితి కానరాలేదని నీటిపారుదల నిపుణులు ఆందోళన చెందుతున్నారు.