గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో అనే లోపాలున్నాయని భావించిన కాంగ్రెస్ సర్కార్ వాటిని గుర్తించేందుకు ధరణి కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ధరణి పోర్టల్పై క్షుణ్నంగా అధ్యయనం చేసి అందులో లోపాలు, మార్పులు చేర్పులపై తాజాగా రెవెన్యూ శాఖకు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ధరణిలో పెండింగ్ సమస్యలు తగ్గకపోవడంపై దృష్టి సారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
సాగు భూమికి పట్టా పాసుపుస్తకం జారీ కావాలంటే ముందుగా ఖాతా సమాచారం, సర్వే నంబర్లు, విస్తీర్ణానికి సంబంధించిన వివరాలన్నీ స్పష్టంగా ఉండాలన్న విషయం తెలిసిందే. వీటిలో ఏ ఒక్కటి సక్రమంగా లేకున్నా పుస్తకం జారీ కాదు. యాజమాన్య హక్కులూ రావు. అయితే రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్న రైతులకు న్యాయం జరగకపోవడానికి ఉన్న కారణాల్లో దరఖాస్తు చేసుకునే విధానం తెలియకపోవడమని తమ అధ్యయనంలో ధరణి కమిటీ గుర్తించింది. ఈ క్రమంలో అన్ని సమస్యలకూ ఒకే దరఖాస్తు విధానం ఉండటం మేలని, పోర్టల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు రెవెన్యూశాఖకు ప్రాథమికంగా సూచించినట్లు సమాచారం.