పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్యని కలిసి సమస్య వివరాలను తెలుసుకుని భూమి పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఆనంతరం కమీషనర్ మొగులయ్యని గౌరవ పూర్వకంగా సత్కరించారు.
అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ దర్శనం మొగులయ్యకి తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం, భాగ్ హయత్ నగర్ సర్వే నెం.159 లో 600 గజాల భూమిని మంజూరు చేయడం జరిగింది. మొగులయ్య సదరు ఫ్లాట్ కు చుట్టూ ఫ్రీ కాస్ట్ గోడ నిర్మించుకున్నారు. 11.10.2024 తేదీన ఉదయం 08:00 గంటల సమయంలో మొగులయ్య తన ప్లాట్ వద్దకు వెళ్లి చూసేసరికి ఉత్తరం వైపు ఉన్న ఫ్రీ కాస్ట్ గోడను గుర్తుతెలియని వ్యక్తులు కూలగొట్టడం జరిగిందని మొగులయ్య 11.10.2024 తేదీ నాడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపియస్ గారు మొగులయ్య గారిని ఈరోజు ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడి తను మరల ఫ్రీ కాస్ట్ గోడ పునర్ నిర్మించుకొనుటకు తగిన తోడ్పాటు గురించి మొగులయ్య నుండి వివరాలు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ భూమి పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకొంటామని ఈ కేసులో తదుపరి విచారణ చేసి గుర్తుతెలియని నేరస్థులను పట్టుకొని చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ హామీ ఇవ్వడం జరిగింది.