తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక అడుగు ముందుకు పడింది. ఈ పథకంలో భాగంగా కనీసం ఒక్క మోటార్‌తోనైనా కరివేన జలాశయం వరకు నీళ్లు ఎత్తిపోయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ లక్ష్యసాధన దిశగా ఆదివారం మొదటి అడుగు పడింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మొదటి పంప్ హౌస్‌లో ఇప్పటికే సిద్ధమైన నార్లాపూర్ పంప్ హౌస్‌లో ఒక మోటార్‌కు అధికారులు.. డ్రై రన్ విజయవంతంగా పూర్తి చేశారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు, నాగర్ కర్నూల్ జిల్లా సీఈ హమీద్ ఖాన్ ప్రత్యేక పూజలు నిర్వహించి డ్రై రన్ ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. డ్రై రన్ విజయవంతం కావడంతో మరో 15 రోజుల్లో వెట్ రన్‌కు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి నీటిని ఒక మోటార్ ద్వారా నార్లాపూర్ జలాశయంలోకి ఎత్తిపోయనున్నారు.