తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆయన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా రూ.54కోట్ల వ్యయంతో 27 చెరువుల కింద 2400 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందని చెప్పారు.
ఉగాదిలోపు ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఖమ్మంలోనే కీలక మంత్రులు ఉన్నారు. ఖజానా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల్లోనే ఉంది. పొంగులేటి వద్ద రెవెన్యూ, హౌసింగ్, తుమ్మల చేతుల్లో వ్యవసాయ శాఖ ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు.