ఇద్దరు పసిపాపలు విషం కలిపిన పాలు తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామపంచాయతీ అంకన్నగూడెంలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి పిల్లల తల్లిదండ్రులు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. అంకన్నగూడేనికి చెందిన పెండకట్ల అనిల్, దేవిలకు లోహిత(3), జశ్విత(1) అనే ఆడపిల్లలున్నారు. శనివారం సాయంత్రం భార్య, పిల్లలతో అంకన్నగూడేనికి వచ్చాడు. గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న అనిల్ తండ్రి వెంకన్న ఆదివారం తెల్లవారుజామున దుకాణానికి వెళ్లి 9.30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో కుమారుడు, కోడలు కనిపించలేదు. పిల్లలెక్కడున్నారని చూసేసరికి ఇద్దరు మనవరాళ్లు మంచంపై అచేతన స్థితిలో కనిపించడం ఓవైపు డాక్టర్, మరోవైపు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న వైద్యులు పిల్లలు అప్పటికే మరణించారని చెప్పారు.
మరోవైపు చిన్నారులు చనిపోయి ఉన్న మంచంపై పాల సీసా, గదిలో ఓ చోట చింపివేసి ఉన్న పాలప్యాకెట్, దుస్తులు పెట్టుకునే సంచిలో పురుగుమందు డబ్బా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలకు పాలల్లో పురుగుల మందు కలిపి తాగించడంతోనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ఇద్దరు మనవరాళ్లను కుమారుడు, కోడలు విష ప్రయోగం చేసి చంపి ఉంటారని అనుమానిస్తూ.. వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జీనత్‌కు మార్ చెప్పారు.