మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతారెడ్డి గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డితో పాటు తాను, తమ అనుచరవర్గం వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతామని సునీతా రెడ్డి తెలిపారు. అయితే.. దీనిపై పట్నం మహేందర్‌రెడ్డి సోదరుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీలో చేరుదామని మా అన్నయ్య పట్నం మహేందర్ రెడ్డి నాతో చర్చించారు.. నేను తిరస్కరించానని వివరించారు. బీఅర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా.. మా అన్న , వదినలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం మీడియాలో చూసానని వెల్లడించారు. వెళ్లే ముందు నాకెలాంటి సమాచారం లేదని తెలిపారు. అయినా రాజకీయాలలో ఎవరి ఇష్టాలు వారివన్నారు. వారికి చేవెళ్ల లోక్ సభకు పోటి చేసేందుకు హామి ఇచ్చినట్టున్నారని…. అందుకే వాళ్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసారనుకుంటానంటూ చెప్పుకొచ్చారు. మా అన్నయ్య కొడుకు జడ్పీటీసి అవినాష్ రెడ్డి కూడా చేరుతారా అనేది నాకు సమాచారం లేదన్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.