తెలంగాణలో పోలింగ్‌పై ప్రధాని మోదీ ట్వీట్‌

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ వేళ పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. తెలంగాణ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ‘‘తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్​లో పేర్కొన్నారు.

మరోవైపు ప్రియాంకా గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో తెలంగాణ పోలింగ్​పై ట్వీట్ చేశారు. ‘‘మీ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మీ ప్రియమైన వారు తమ జీవితాలను త్యాగం చేసిన మాతృభూమి కోసం ఆలోచించి ఓటు వేయండి. నిజమైన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీకు చూపించగల వారికి అవకాశం ఇవ్వండి.’’ అని కోరారు.

ఇంకోవైపు ‘‘మీ ఓటు వచ్చే ఐదేళ్ల గతిని నిర్ణయిస్తుంది. సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఓటూ కీలకం. అర్హులైన ఓటర్లందరూ, ప్రత్యేకించి మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి. మీ కుటుంబం, స్నేహితులు కూడా ఓటు వేసేలా ప్రోత్సహించండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version