పసుపు రైతుల ప్రగతి కోసం ఎంతవరకైనా వెళ్తాం.. ప్రధాని మోదీ ట్వీట్

-

పాలమూరు జిల్లాలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలపై వరాలజల్లు కురిపించారు. పసుపు బోర్డుతో పాటు గిరిజన యూనివర్సిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాష్ట్ర పసుపు రైతులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు.

తెలంగాణ పసుపు రైతుల అభివృద్ధి కోసం పసుపు బోర్డు ప్రకటించిన మోదీ జీకి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ బోర్డు నిజామాబాద్ రైతుల ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బోర్డుతో పసుపు రైతులకు గిట్టుబాట ధర లభించడమే కాదు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తుంది. పసుపు కేవలం పంట మాత్రమే కాదు. ఇది మన సంస్కృతిలో అంతర్భాగం. పసుపును ఆరోగ్యానికి, వంటల్లో, సంప్రదాయపరంగా వినియోగిస్తారు. పసుపు బోర్డు ప్రకటించడం వంటి చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి రైతుల తరఫున, బీజేపీ శ్రేణుల తరఫున ధన్యవాదాలు. అని అర్వింద్ ట్వీట్​లో పేర్కొన్నారు.

ఎంపీ అర్వింద్ ట్వీట్​ను రీ ట్వీట్ చేసిన ప్రధాని.. “మన రైతుల శ్రేయస్సు,సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డు‌ను ఏర్పాటు చేయడం ద్వారా, మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం. మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మేము ఎంతవరకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం.” అంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version