పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది. ఏళ్ల తరబడి కర్షకులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కళ్లు కాయలు కాచేలా చూస్తున్న అన్నదాతలను చివరకు కేంద్రం కరుణించింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో రైతుల కల నెరవేరినట్లయింది. దశాబ్దాలుగా చేసిన పోరాటాన్ని గుర్తించిన ప్రధాని వల్లే సాధ్యమైందని రైతులు అభిప్రాయపడ్డారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మోదీకి పసుపు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు. జాతీయ పసుపు బోర్డు ప్రకటించడంపై రైతులతో పాటు బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు, కమలం కార్యకర్తల సంబురాలు అంబరాన్నంటాయి. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ ఈ ప్రాంత రైతులకు చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోలేరని కొనియాడారు. మరోవైపు జాతీయపసుపు బోర్డు ప్రకటనపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన బీజేపీ జాతీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.