చలికాలం వచ్చేసింది. అక్టోబర్లోనే పగటి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఇక రాత్రిళ్లు చలి పంజా విసురుతోంది. మరోవైపు వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ కాలుష్యానికి శీతాకాలం తోడై ప్రజల ఆరోగ్యాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల కారణంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు కాలుష్య తీవ్రతను మరింత పెంచుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి పలు కాలుష్య కారకాలు పరిశ్రమలు, వాహనాలు, చెత్తను కాల్చడం ద్వారా వెలువడుతుంటాయని నిపుణులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఆయా ధూళికణాలు చెల్లాచెదురవుతాయని.. చలికాలంలో గాలిలో కదలికలు తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ సేపు తక్కువ ఎత్తులో ఒకేచోట ఉండిపోతాయని తెలిపారు. ఇవి ముక్కులోంచి నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.
కొద్ది రోజులుగా చలి పెరుగుతుండటంతో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోందని.. ముఖ్యంగా కనిష్ఠ ఉష్రోగ్రతలు నమోదైన సమయాల్లో నాణ్యత సూచి స్వచ్ఛం నుంచి మధ్యస్థస్థాయికి పడిపోతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.