కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నన్ను ఓడించేందుకు ఒక్కటయ్యాయని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు పట్టభద్రులు బ్యాలెట్ పేపర్ పై ఒకటయ్యాయన్నారు. బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను తిరిగి ఉద్యోగంలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నన్ను నమ్ముకున్న వ్యక్తుల సమస్యల కోసం భవిష్యత్తులో కొట్లాడుతూ రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. ప్రసన్న హరికృష్ణ ఒకడు కాదని ఓట్ల రూపంలో చూపించారని గత ఏడు నెలలుగా నా కోసం కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
సంబంధం లేని వ్యక్తులు వచ్చి రాజకీయాలను కలుషితం చేస్తున్నారనే తాను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మరొక పదిమందిని తయారు చేస్తాడని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయన్నారు. రూపాయి ఖర్చు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించాను. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వణుకు పుట్టించామన్నారు. నన్ను అడ్డుకునేందుకు సీఎం మూడు సభలు పెట్టారన్నారని, నా నామినేషన్ ను అడ్డుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నం చేశారన్నారు. బీఆర్ఎస్ నాకు మద్దతు ఇవ్వలేదు. నేను వారిని మద్దతు అడగలేదన్నారు. ఓటర్ కు ఒక రూపాయి పంచకుండానే 60 వేల పైగా ఓట్లు తెచ్చుకోగలిగాన్నారు.