ఈ ఏడాది మండు వేసవిలోనూ కుంభవృష్టి కురిసింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో భారీగా వర్షాలు కురిసి అన్నదాతలను ముప్పుతిప్పలు పెట్టాయి. ఈ రెండు నెలల్లో కురిసిన వానలు ఈ ఏడాది వర్షపాతం రికార్డులను మార్చేశాయి. 40 ఏళ్ల తర్వాత వేసవిలో ఈ ఏడాదే అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదైంది. 2022-23లో (జూన్-మే) నమోదైన వర్షపాతం గత రికార్డులను తుడిచిపెట్టేసింది. సాధారణ వర్షపాతం కన్నా 54 శాతం అధికంగా నమోదైంది.
వాతావరణశాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డు ప్రకారం 1951-52 నుంచి వివరాలను పరిశీలిస్తే 1989-90లో మే నెలలో మాత్రమే 577 శాతం వర్షపాతం నమోదైంది. అప్పుడు సాధారణ వర్షపాతం 25.8 మి.మీ.కుగాను 174.7 మి.మీ కురిసింది. దీనికి భిన్నంగా ఈ ఏడాది మే నెలలో సాధారణ వర్షపాతం 2.6 మి.మీ.కుగాను ఇప్పటికే 39.3 మి.మీ. కురిసి 1412 శాతం నమోదైంది. గతేడాది జులైలో 121 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఈ మార్చిలో 413 శాతం, ఏప్రిల్‌లో 338 శాతం అధికంగా నమోదయ్యాయి.