పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై సొంత పార్టీ నేత రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. జీవన్ రెడ్డికి అనవసరంగా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారని గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ మండవ వెంకటేశ్వరరావు కు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. మండవ స్థానికుడని.. ఆయనను ఖమ్మం నుంచి పోటీ చేయించాలనుకుంటే కార్యకర్తలు ఒప్పుకోలేదని గుర్తుచేశారు.
జీవన్ రెడ్డికి రెండు సీట్లు కేటాయించినట్లు అయింది కదా అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం స్థానం నుంచి మండవ వెంకటేశ్వరరావును బరిలోకి దించాలని భావించినా చివరికి పొంగులేటి వియ్యంకుడు రామ సహాయం రఘురామరెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సీటు నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, పొంగులేటి సోదరుడు పేరు ప్రముఖంగా వినిపించిన కాంగ్రెస్ మాత్రం రఘురామిరెడ్డి పేరునే ఫైనల్ చేసింది. అయితే సొంత పార్టీ నేతపై రేణుకా చౌదరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.