ప్రగతి భవన్‌ అంబేడ్కర్‌ భవన్‌గా మారుతుంది: రేవంత్‌రెడ్డి

-

తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని.. ఈ తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో 21 రోజులు సాగిందని.. ఈ యాత్ర ద్వారా రాహుల్‌ మాలో స్ఫూర్తినింపారని వెల్లడించారు. రాహుల్‌, సోనియా, ప్రియాంకలకు తెలంగాణతో కుటుంబ అనుబంధం ఉందని చెప్పారు. తనను, భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు.

“ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. తెలంగాణలో మానవహక్కులను కాపాడతాం. ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే చర్యలకు అన్ని పార్టీలు కలిసిరావాలి. ప్రగతి భవన్‌ అంబేడ్కర్‌ భవన్‌గా మారుతుంది. ఇక నుంచి ప్రగతి భవన్‌.. ప్రజా భవన్‌ అవుతుంది. పార్టీని విజయం వైపు నడిపించిన ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులకు కృతజ్ఞతలు. విపక్షాలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పార్టీ సీనియర్ల సహకారంతో ఈ విజయం సాధ్యమైంది.” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version