నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పడిన గండితో పరిసర ప్రాంతాలు వరద నీటిమయమయ్యాయి. ఈ గండిని పూడ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం పూర్తిగా తగ్గకపోవడంతో.. ఇవాళ గండి పూడ్చటం కష్టమని అధికారులు తెలిపారు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని నర్సింహుల గూడెం, నిడమనూరులోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.
ఇప్పటికే వరదనీటితో నిడమనూరు మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల వరద నీటితో నిండిపోయింది. రాత్రే అందులో ఉన్న 87 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అర్ధరాత్రి వరకు ప్రవాహం స్థానికంగా ఉన్న పలు దుకాణాల్లోకి చేరింది. ఉదయానికి కాస్త వరద తగ్గుముఖం పట్టిన తరువాత గండి పడిన ప్రాంతాన్ని, సాగర్ జలాశయం సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్ఈ ధర్మ, జిల్లా సబ్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీఓ రోహిత్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత పరిశీలించారు.