కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోలింగ్‌శాతం స్వల్పంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు లోక్‌సభకు మాత్రమే ఓటు వేయగా.. కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోని ఓటర్లు మాత్రం 2 ఓట్లు వినియోగించుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణంతో సోమవారం (మే 13వ తేదీ) ఉప ఎన్నిక జరిగింది. మల్కాజిగిరి లోక్‌సభతో పాటూ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల వరకు 50.34 శాతం ఓట్లు పోలయ్యాయి.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో 47.81 శాతంతో పోలిస్తే చాలా స్వల్పంగా ఓటింగ్ శాతం ఇక్కడ ఈసారి పెరిగింది. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 49.36 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఉప ఎన్నిక, మల్కాజిగిరి లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఓటర్లు భారీగా క్రాస్‌ఓటింగ్ చేశారు. అసెంబ్లీలో త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోరు నడిచింది. ఇదే విధంగా ఒక ప్రధాన పార్టీకి చెందిన కీలక నేతలు తమ ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఓటేయించారన్న ప్రచారం కూడా అభ్యర్థులను కలవరపెడుతోంది.