హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే ఈ కేసులో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రమేయం కూడా ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కస్టడీ విచారణ సమయంలో శివబాలకృష్ణ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును చెప్పడంతో ఏసీబీ అధికారులు అతణ్నీ విచారించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై న్యాయ సలహా తీసుకుని నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఐఏఎస్ అధికారి ఆదేశాల మేరకు అనుమతులు జారీ చేసి రూ.కోట్లను శివబాలకృష్ణ గడించినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని బాలకృష్ణ అంగీకరించినట్లు తెలుస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఆయన వాటాను తానే స్వయంగా తీసుకెళ్లి అప్పగించినట్లు శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సప్ సంభాషణలు జరిగాయని, అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సదరు అధికారికి నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం.