కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది – వైఎస్ షర్మిల

-

మంత్రి కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పోలీసులను అడ్డుపెట్టుకోవడం లేదట! ఓటర్లకు డబ్బు, మద్యం పంచట్లేదట! చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదేనని ఎద్దేవా చేశారు. పోలీసులు అడ్డు లేనిదే అడుగు కూడా బయట పెట్టలేనోడు.. ముందుగానే ప్రశ్నించే గొంతులను హౌజ్ అరెస్టులు చేయించేటోడని తీవ్ర విమర్శలు చేశారు.

“అడ్డం పొడుగు మాటలు చెప్తే నమ్మే పిచ్చోళ్లు కాదు తెలంగాణ ప్రజలు. అన్నం పెట్టే రైతుకు బేడీలు వేసి, చంటి బిడ్డల తల్లులు అని చూడకుండా జైళ్లకు పంపిన హింసాత్మక పాలన మీది. పోలీసు వ్యవస్థను మీ బానిస వ్యవస్థగా మార్చారు. అయ్యా చిన్న దొర కేటీఆర్.. మీరు నిజంగా సుద్ధపూసలే అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. నేరెళ్ళలో దళితులపై పోలీసులను అడ్డుపెట్టుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదా? ఇప్పటికీ నువ్వు సిరిసిల్ల పోతే 7 ఏళ్లుగా ఆ నేరెళ్ల మొత్తం హౌజ్ అరెస్ట్ చేయడం లేదా..? మిడ్ మానేర్ ముంపు బాధితులు న్యాయ మడిగితే అరెస్టులు చేయలేదా?

నిన్న గాక మొన్న వరంగల్ పోతే విద్యార్థి నాయకులను, ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేయించలేదా? నీ సభల కోసం జనాలు రాకపోతే పథకాలు కట్ అని బెల్లంపల్లిలో బెదిరించలేదా?? డబ్బు, మద్యం పంచనని దొంగ మాటలు చెప్పే దొర గారు.. మొన్నే జరిగిన సిరిసిల్ల కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో డబ్బులు పంచలేదా? మద్యం పారించలేదా? మునుగోడు,నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటుకు 10వేలు పంచింది మీ సారథ్యంలోనే కదా! సర్పంచ్ నుంచి ఎంపీ ఎలక్షన్ల దాకా డబ్బులు కుమ్మరించి, మద్యం ఏరులై పారించింది నీ తాలిబన్ల పార్టీ.

సంతలో పశువులను కొన్నట్లు వేల కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొన్నది నీ పార్టీ.తెలంగాణ సొమ్మును సొంత ఖజానా నింపుకొని దేశ రాజకీయాలనే కొనేంత కాజేశారు.మొత్తం లోక్ సభ ఎన్నికలకు పెట్టేంత సొత్తు వెనకేశారు. బంధిపోట్ల రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నీకు దమ్ము, ధైర్యం ఉంటే… వచ్చే ఎన్నికల్లో ఎలాంటి డబ్బు, మద్యం పంచబోమని బొడ్రాయి మీద ప్రమాణం చెయ్యి. నీ పాలన మీద నమ్మకమే ఉంటే పోలీసుల సాయం తీసుకోనని గ్రామ దేవతల మీద ఒట్టు వెయ్యి !” అంటూ సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version