టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాఫ్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్వశ్చన్ పేపర్లను దక్కించుకోడానికి కొందరు పొలాలను సైతం తాకట్టు పెట్టారనీ తెలుస్తోంది. రేణుక, డాక్యానాయక్ దంపతులు ప్రవీణ్‌కుమార్‌కు రెండు దఫాలుగా రూ.10 లక్షలు చెల్లించి అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేశారనీ సిట్ అధికారులు తెలిపారు.
సిట్ అధికారుల సమాచారం ప్రకారం.. ఆ క్వశ్చన్ పేపర్లను కె.నీలేష్‌నాయక్, పి.గోపాల్‌నాయక్‌లకు రాజేశ్వర్‌నాయక్ అనే మధ్యవర్తి ద్వారా డాక్యానాయక్ రూ.13.50 లక్షలకు విక్రయించాడు. తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా రాజేందర్‌కుమార్‌కు రూ.5 లక్షలకు అమ్మాడు. ప్రశాంత్‌రెడ్డి నుంచి రూ.7.50 లక్షలు వసూలు చేశాడు. వీరిలో నీలేష్‌నాయక్, గోపాల్‌నాయక్, రాజేందర్‌కుమార్‌లు తమ గ్రామాల్లోని పంట పొలాలను తాకట్టు పెట్టి మరీ డబ్బు చెల్లించినట్టు సమాచారం.
నీలేష్‌నాయక్, గోపాల్‌నాయక్‌లకు మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేసిన శ్రీనివాస్ రూ.లక్ష ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ప్రశాంత్‌రెడ్డి కూడా నగలు తనఖా ఉంచి కొంత, అప్పుగా తెచ్చి మరికొంత కలిపి మొత్తం రూ.7.50 లక్షలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నలుగురికే కాకుండా మరో 11 మందికి ఏఈ ప్రశ్నపత్రాలు చేరినట్టు సిట్ పోలీసులు అంచనాకు వచ్చారు. వారి వివరాలు సేకరిస్తున్నారు.