తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసులో ఇవాళ కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు.. ఏ-3 లక్ష్మ, ఏ-5 కుమార్‌లకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్లపై జస్టిస్ బోపన్న, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టగా.. తుది ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు నిందితుల తరఫు లాయర్లు తెలిపారు. స్థానిక కోర్టులో విచారణ జరుగుతున్నట్లు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ట్రయల్ కోర్టు నిబంధనల మేరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.
2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరి వస్తుండగా.. కల్వచర్ల వద్దకు చేరుకోగానే వారిని దుండగులు అడ్డుకున్నారు. దాదాపుగా 20 నుంచి 30 నిముషాలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. ప్రజల మధ్యే దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే.