తెలంగాణ దశాబ్ధ ప్రగతిపై ‘స్వేద పత్రం’.. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కేటీఆర్ కౌంటర్

-

తెలంగాణలో రాజకీయం విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లతో చాలా రసవత్తరంగా మారుతోంది.   రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుండగా; అసమర్థతతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా తాజాగా కేటీఆర్ ‘స్వేదపత్రం’ ప్రకటించారు. శనివారం తెలంగాణ భవన్ లో ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.

తెలంగాణ తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రాత్రీపగలూ నిర్విరామంగా శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని, ఇప్పుడు తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు ‘స్వేదపత్రం’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని అవమానించొద్దని, గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తామని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version