Telangana: తొలి రోజు ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ సక్సెస్ అయింది. ఊరూరా ఉత్సవంగా స్పెషల్ డ్రైవ్ ను చేపట్టారు. లక్షల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని లక్షల మొక్కలను నాటారు. వేల కిలోమీటర్ల మేర రహదారులను, మురుగునీటి కాలువలను శుభ్రపరిచారు. ములుగు నియోజకవర్గంలో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించగా..జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధి కారులు స్పెషల్ డ్రైవ్ లో పాలుపంచుకున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో.. మొదటి రోజు పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా గ్రామగ్రామాన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమం చేపట్టిన మొదటి రోజే 9164 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్రపరిచారు. గ్రామాల్లో 6135 కిలోమీటర్ల మేర మురుగు నీటి కాలువలను పరిశుభ్రపరిచారు. 8.02 లక్షల మొక్కలను నాటారు. 20,359 ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలను శుభ్రపరిచారు. స్వచ్ఛదనం-పచ్చదనం డ్రైవ్ లో భాగంగా 40, 888 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని గుర్తించారు. 10, 844 గ్రామపంచాయతీల్లో, 14,016 పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్ధులను సన్మానించారు.