నాంపల్లిలో బత్తిని కుటుంబం అందజేస్తున్న చేప ప్రసాదం హైదరాబాద్‌కు గర్వకారణమని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తారని తెలిపారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని హరినాథ్‌గౌడ్ నేతృత్వంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా మంత్రి తలసాని ఈ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించారు.
24 గంటలపాటు నిర్విరామంగా కొనసాగనున్న ఈ కార్యక్రమానికి నిన్న సాయంత్రం వరకే దేశం నలుమూలల నుంచి సుమారు 25 వేల మందికి పైగా ఆస్తమా బాధితులు తరలిరావడంతో మైదానం కిటకిటలాడుతోంది. వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో జీహెచ్‌ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు సమకూరుస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తలసాని తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదనంగా మరో 75 వేల చేప పిల్లలతోపాటు.. అవసరమైతే మన్ని చేప పిల్లలను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.