సికింద్రాబాద్: అమెరికాలోని తానా సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మునిగిపోతున్న కాంగ్రెస్ ని మొత్తంగా ముంచే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని సెటైర్లు వేశారు. రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని మండిపడ్డారు. రైతులను కష్టపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి పేర్కొనడం తెలివితక్కువ ఆలోచన అని విమర్శించారు.
తన వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తే కాంగ్రెస్ నాయకులకు పుట్టగతులు ఉండవన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చారని ప్రశ్నించారు తలసాని. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు 9 సంవత్సరాలుగా ధీమాగా ఉన్నారని చెప్పారు. రైతు భీమా వంటి కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తుంది అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా..? పార్టీ నిర్ణయమా..? చెప్పాలని డిమాండ్ చేశారు.