తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం వేకువ జామున 5 గంటలకే ఉద్యోగులు, సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 16-25 రౌడ్లలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుదని వెల్లడించారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. సర్వీసు ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గం చార్మినార్. అక్కడ 202 కేంద్రాల్లో ఎన్నిక జరగ్గా, ఆయా ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తవుతుంది. మిగిలిన స్థానాల్లో ఫలితాలకు 16 నుంచి 25 రౌండ్లు వేచిచూడాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న శేరిలింగంపల్లి నియోజవర్గంలో ఓట్ల లెక్కింపు 23 రౌండ్లలో పూర్తవుతుందని వెల్లడించారు.