దిల్లీకి టీ-కాంగ్రెస్ నేతలు.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై సమాలోచనలు

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో కాక రేపుతోంది. ఎలాగైనా.. రాజగోపాల్ రెడ్డిని పార్టీలోనే కొనసాగించేలా చూడాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హైకమాండ్ కూడా దీనిపై గట్టిగానే ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే దిల్లీకి టీ-కాంగ్రెస్ నేతలు పయనమవుతున్నారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నేతృత్వంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై సమాలోచనలు చేయనున్నారు.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటలకు సీఎల్పీ నేత దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే జానారెడ్డి దిల్లీ వెళ్లగా.. మిగతా ఎంపీలు అంతా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో దిల్లీలోనే ఉన్నారు.
రాజగోపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీ వీడకుండా చూడాలని గత వారం వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ లు రాజగోపాల్ తో భేటీ అయ్యి బుజ్జగించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి బుజ్జగించారు. అయినా ఆయన పార్టీ వీడాలనే ఆలోచనకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తుండటంతో ఏం చేయాలన్న దానిపై నేడు నేతలు సమాలోచనలు చేయనున్నారు. టీ-కాంగ్రెస్ నాయకులు, నల్గొండ ముఖ్య నేతలతో మాట్లాడి ఈ విషయంపై హైకమాండ్ ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం

Read more RELATED
Recommended to you

Exit mobile version