తెలంగాణలో లోక్సభ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ పోరులోనూ రిపీట్ చేయాలని కష్టపడుతున్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును ప్రస్తావిస్తూ.. మిగతా హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తామని మాటిస్తున్నారు.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే రేపు తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించినట్లు పార్టీ వర్గాల సమాచారం.