తెలంగాణ కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదల

-

కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తుది ఎంపిక జాబితాను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి బుధవారం విడుదల చేసింది. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల, రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు గాను… 12,866 మంది పురుషులు….. 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించనున్నారు.

తెలంగాణ పోలీసుల నియామక మండలి చేపట్టిన కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను నియామక మండలి వెబ్‌సైట్లో వ్యక్తిగత లాగిన్లలో పొందుపరచనున్నట్లు వెల్లడించింది. అలాగే కటాఫ్ మార్కుల వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. అయితే న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కొనసాగుతున్నందున పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

తుది ఎంపిక జాబితాలో చోటు దక్కిన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అటెస్టేషన్ పత్రాల ఈనెల 7 నుంచి 10వ తేదీల మధ్య అందుబాటులో ఉంచనున్నారు. వాటిని డిజిటల్ గా పూరించిన అనంతరం డౌన్లోడ్ చేసి పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను అతికించి మూడు సెట్లపై గెజిటెడ్ అధికారి సంతకాలు తీసుకోవాలని సూచించారు. ఆయా పత్రాలను ఈనెల 12, 13 తేదీల్లో నిర్ణీత కార్యాలయాల్లో సమర్పించాలని పేర్కొన్నారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులు తాము ఎంపికైన జిల్లా ఎస్పీ కార్యాలయం లేదా కమిషనరేట్లలో ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్- సీపీఎల్, రవాణా కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో. టీఎస్ఎస్పీ, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఫైర్‌మెన్, ఎక్సైజ్, వార్డర్లు, రవాణా కానిస్టేబుల్ అభ్యర్థులు సంబంధిత పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయంలో అటెస్టేషన్‌ పత్రాలను సమర్పించాలని బోర్డు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version