తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం అనుమతి ఇచ్చిన 416కు పైగా ప్రకటనల్లో 15 ప్రచార చిత్రాలను తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. వక్రీకరించి, తప్పుగా అన్వయించినందుకే అనుమతులు ఉపసంహరించినట్లు స్పష్టం చేసింది. ప్రకటనలకు సంబంధించి ఈనెల 8,9,10వ తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు జరిపి మార్గదర్శకాలు క్షుణ్ణంగా వివరించినట్లు తెలిపింది.
సామాజిక మాధ్యమాలు సహా, పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియాల వంటి వేదికల మీద దుర్వినియోగంపై తలెత్తే సమస్యలను తేల్చి చెప్పినట్లు సీఈవో కార్యాలయం పేర్కొంది. పార్టీలు విడుదల చేసే ప్రకటనలను ప్రసారం చేసే ముందు టీవీ ఛానెళ్లు వాటిలోని అంశాలు, ధృవీకరణ పొందిన ప్రకటనతో సరి చూసుకోవాలని సూచించింది. అనుమతి పొందిన ప్రకటనలు సీఈవో కార్యాలయంలోని ఐ అండ్ పీఆర్ డిప్యూటీ డైరెక్టర్ వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపింది. అనుమతి ఉపసంహరించిన వాటిలో కాంగ్రెస్‌వి ఆరు, బీజేపీవి ఐదు, బీఆర్ఎస్ పార్టీవి 4 ప్రకటనలు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కేంద్రం కార్యాలయం వెల్లడించింది.