తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న సెలవు ప్రకటించింది. ఆ రోజున జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండో శనివారం రోజు ఉండే సెలవు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 31న రాత్రి 1గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నారు. ఈ నెలలో చివరి రోజున క్లబ్ లు, బార్లు, రెస్టారెంట్లు, హోటల్లను ఒంటిగంట వరకు తెరచి ఉంచేందుకు అనుమతి ఇస్తారు. అయితే దీనికోసం ఆయా షాపుల నిర్వాహకులు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు సొసైటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి నుమాయిష్ లో దాదాపు 2,400 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రవేశ రుసుమును రూ. 40 గా నిర్ణయించారు. వృద్ధులు, నడవలేని వారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటలలోపు వారి వాహనాలతోనే సందర్శించే అవకాశం కల్పిస్తారు. ఈసారి 25 లక్షల మందికిపైగా సందర్శించే ఛాన్స్ ఉంది.