తెలంగాణ ప్రజలకు అలర్ట్. తెలంగాణలో గత రెండు రోజులుగా చలి తీవ్రత మళ్ళీ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 0° లకు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ చలి ప్రభావం పెరిగింది. రోజురోజుకు రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తుంది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో శుక్రవారం 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డీజిట్ కే పడిపోతున్నాయి. సంగారెడ్డిలో కనిష్టంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సిద్దిపేట జిల్లాలో 10.4, మెదక్ జిల్లాలో 11.1 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీచేశారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.