ప్రణీత్‌రావు పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

-

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్పై బుధవారం రోజున హైకోర్టులో వాదనలు ముగిశాయి.

తొలుత పిటిషనర్‌ ప్రణీత్ రావు తరఫు సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌ రావు వాదించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ రావును కస్టడీకి ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పోలీసు స్టేషన్‌లో కనీస వసతులు ఉన్నాయని వెల్లడించారు.

ఫిర్యాదుదారు అయిన ఏసీపీ రమేశ్‌కు దర్యాప్తులో పాత్ర లేదని, పిటిషనర్‌.. తన న్యాయవాది ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నారని కోర్టుకు వివరించారు. ఏడు రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని.. మిగిలింది మూడు రోజులేనని, ఉపయోగంలేని ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version