తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే నియమితులయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో కొలీజియం ఆ స్థానానికి జస్టిస్ ఆలోక్ అరాధే పేరును సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో సేవలందిస్తున్నారు.
జస్టిస్ ఆలోక్ అరాధే 1964 ఏప్రిల్ 13న రాయపుర్‌లో జన్మించారు. 1988 జులై 12న అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. 2007లో సీనియర్ న్యాయవాది హోదా పొందిన అరాధే.. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది.. 2016 సెప్టెంబరు 16న జమ్మూకశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018 మే 11 నుంచి ఆగస్టు 10 వరకు అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి.. 2018 నవంబరు 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2022 జులై 3 నుంచి అక్టోబరు 15 వరకు ఆ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.