జీవో 33పై వివరణ ఇవ్వండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

-

స్థానికతకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ గత నెల 19న ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలాక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి జీవో 33పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

గతేడాది హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ జీవో తీసుకువచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ప్రస్తుత నిబంధన ప్రకారం ఆడ్మిషన్‌ కు ముందు.. వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చారని, గతంలో 10వ తరగతివరకు చదివి తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతరత్రా ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాల్లో ఇక్కడ శాశ్వత నివాసానికి సంబంధించి ఎమ్మార్వో ద్రువీకరణ పత్రం సమర్పించాలని ఈ హైకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. దాని ప్రకారం గత ఏడాది అడ్మిషన్లు జరిగాయని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకే తీవ్ర నష్టం వాటిల్లుతోందని కోర్టుకు విన్నవించారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదుల వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ.. జీవో 33పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version