రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి వివాదం హైకోర్టుకు చేరింది. ఈ వ్యవహారంపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత, ఇతర పనులను ఏప్రిల్ 3వ తేదీ (గురువారం) వరకు ఆపాలని ఆదేశిస్తూ.. పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.
అంతకుముందు హైకోర్టులో హెచ్‌సీయూ తరఫున ఎల్. రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. కంచ గచ్చిబౌలి భూముల వద్ద చెట్లు కొట్టేస్తున్నారని.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని అన్నారు. వన్య ప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించి.. నెల రోజుల పాటు అధ్యయనం చేయాలని కోర్టుకు తెలిపారు. ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు రేపటి వరకు చెట్ల నరికివేత ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.