- వ్యాక్సినేషన్ కు సర్వం సిద్ధం
- అన్నీ జిల్లాలకు వ్యాక్సిన్ డోసులను పంపించాం
- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ః దేశవ్యాప్తంగా శనివారం (జనవరి 16) నుంచి ప్రజలకు కరోనా టీకాను అందించాడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఇక తెలంగాణలోనూ వ్యాక్సినేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్రలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు విషయాలను మీడియాకు వెల్లడించారు.
కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన కరోనా వ్యాక్సిన్ డోసులను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు మొదటి విడుతలో భాగంగా 5,527 కరోనా టీకా వాయిల్స్ ను పంపిణీ చేశామని వెల్లడించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 21 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ వేయనున్నామని తెలిపారు. దీనిలో భాగంగా వరంగల్ అర్బన్ 2,640, వరంగల్ రూరల్ 580, మహబూబాబాద్ కు 1720, జనగాంకు 830, ములుగు 560, భూపాలపల్లికి 500 డోసులు పంపిణీ చేసినట్లు వివరించారు.
కాగా, మొదటి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 139 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించనున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు. రెండో దశలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ టీకాను ప్రజలకు అందిస్తామని తెలిపారు. అయితే, టీకా తీసుకోవడం వల్ల ఏవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వారికి వైద్యం అందించడానికి రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఉంచినట్టు వెల్లడించారు. టీకా పంపిణీకి సంబంధించి ప్రజలందరూ సహకరించాలని కోరారు.