వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు చెల్లింపులతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 1కోటి 52లక్షల 47వేల 864 చలాన్లకు గాను 135 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34 కోట్ల రూపాయలు, సైబరాబాద్ లో 25 కోట్ల రూపాయలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇ
ప్పటి వరకూ 42.38శాతం చలాన్లకు మాత్రమే చెల్లింపులు జరిగాయని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. రాయితీపై చెల్లించేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో త్వరగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు చెల్లించాలని పోలీసులు సూచించారు. గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని వారు తేల్చి చెప్పారు. గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం 15 రోజులు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే సర్వర్ సమస్య సహా చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు ఉత్సాహం చూపడంతో ఈ నెల 31వ తేదీ వరకూ గడువు పొడిగించింది.