తెలంగాణలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నగరంలో వర్షాల వల్ల ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితులను GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు.