ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ నడుస్తోంది. క్రికెట్ లవర్స్ కు ఓ నెలరోజుల పాటు పండుగే పండుగ. అయితే ఐపీఎల్ జోష్ మరింత పెంచేలా క్రికెట్ అభిమానులకు తెలంగాణ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సందర్భంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులు నడపనున్నట్లు తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఉప్పల్ స్టేడియం వద్దకు ఆపరేట్ చేయనున్నట్లు హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్న రోజుల్లో ఈ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించారు. మార్చ్ 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు వివరించారు. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.