తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అంగన్వాడిలో న్యూట్రీషియన్ కిట్లు అందజేస్తుంది. అలాగే మధ్యాహ్న భోజనం, గుడ్లు సరాఫరా చేస్తున్నారు.
అయితే అంగన్వాడీలకు చేరే గుడ్లు పక్కదారి పడుతున్నాయని గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీచర్లు, ఆయాలతో పాటు గుత్తేదారులు వారిని దారి మళ్లిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీల్లో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు రంగుల ముద్రలు వేయాలని నిర్ణయం తీసుకుంది. జోన్ నెంబర్ తో ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులను గుడ్లకు వేసేలా ఏర్పాటు చేసింది. నెలలో మూడు దఫాలుగా ఈ గుడ్లకు రంగులు వేసి పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.