సెల్ ఫోన్ల రికవరిలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేల24 సెల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు. సీఈఐఆర్ వెబ్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్లను పట్టుకున్నారు. వివిధ కారణాల వల్ల చోరీ అయిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో 33.71 శాతం స్వాధీనం చేసుకొని రాష్ట్ర పోలీసులు రికార్డు సాధించారు.
32.08 శాతం ఫోన్లను స్వాధీనం చేసుకుని కర్ణాటక రెండో స్థానం, 30.01 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో 2,156, సైబరాబాద్ కమిషనరేట్‌లో 1,790, రాచకొండలో 1,488 ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన సీఈఐఆర్ వెబ్ పోర్టల్‌ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం తొమ్మిది నెలల కాలంలో పోయిన ఫోన్‌లలో 1,06,132 సెల్‌ఫోన్లను బ్లాక్ చేసి.. 43,935 ఫోన్లను గుర్తించారు. గుర్తించిన వాటిలో 15,024 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బాధితులకు అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.