తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు ఇవాళ (జూన్ 12వ తేదీ) విడుదల కానున్నాయి. తొలిసారి ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. మార్కుల కేటాయింపును సాధారణ పద్ధతిలో చేశారా? నార్మలైజేషన్ విధానంలోనా? అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫలితాల విడుదల సమయాన్ని కూడా వెల్లడించలేదు.
డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈరోజు విడుదలయ్యే టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో డీఎస్సీ దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. డీఎస్సీకి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి.