తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఈ ప్రభావంతో గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి తెలంగాణ రాష్టంలోని నిజామాబాద్ దిశగా వెళ్తున్నాయి. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా నైరుతి దిశ నుంచి వీస్తున్నాయి. ఇవాళ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. సోమవారం కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.