తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించారు. నైరుతి ఆవర్తనం, దాని పరిసరాల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతున్నదని వివరించారు. ఈ కారణంగా వర్షాలు ఉండవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 163.3 మి.మీ వర్షపాతం నమోదైంది.