గత వారమంతా రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికించాయి. రెండ్రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ ఆదివారం రోజున భారీ వర్షం కురిసింది. ఇక రెండ్రోజుల నుంచి తెరిపిచ్చింది. అయితే రేపు, ఎల్లుండి మరోసారి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తరవాయవ్య దిశగా కదులుతోందని వివరించింది. ఈ నెల 3 నుంచి 6 వరకు వాయవ్య భారతంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.